తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన బోనాల పండుగ ఇవాళ్టితో ముగియనుంది. ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢమాసం చివరివారం పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే లాల్ దర్వాజ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు.. తెల్లవారు జామునుంచే మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇవాళ లాల్ దర్వాజ బోనాల పండుగలో బీఆర్ఎస్ మంత్రులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ బోనాల అనంతరం… సోమవారం రోజునఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో పండుగ ముగియనుంది. బోనాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆలయాన్ని సందర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.