రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అంతర్జాతీయ ఐటీ ఆవిష్కరణల సంస్థ(ఐటీఐఎఫ్) సెప్టెంబర్ 13న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ వాణిజ్య, ఆవిష్కరణల విధానంపై వార్షిక శిఖరాగ్ర సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ శనివారం ఆయనకు లేఖ రాశారు.
అధునాతన, సాంకేతిక రంగాల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ సాధించిన ప్రగతి, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి డిజిటల్ సాంకేతికత తోడ్పాటు అంశాల గురించి సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను స్టీఫెన్ కోరారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్లకు సృజనాత్మక పరిష్కారంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతలు, వ్యాపార, వాణిజ్య, విద్యావేత్తలు సదస్సులో పాల్గొంటారని లేఖలో వివరించారు.
ఇక ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సులకు మంత్రి కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్, అమెరికా, యూకేలలో కూడా కేటీఆర్ పర్యటించారు.