బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేని పార్టీ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ భేటీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు గాను ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతూ.. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వారి ఆటలు మరెన్నో రోజులు సాగవని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ముమ్మాటికి ఒకే గూటి పక్షులని వారిని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో కాంగ్రస్ ఇచ్చి హామీలను పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.