నాన్ వెజ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. కోడి ధర కొండెక్కింది. ముక్క గొంతు దిగనంటోంది. చుక్కలనంటుతున్న చికెన్ ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాల్లోనే రూ.100 ధర పెరగడమేంటని అవాక్కవుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ధాటికి కోళ్లు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల సంఖ్య తగ్గి.. మాంసానికి డిమాండ్ పెరిగడంతో ధరలు ఊపందుకున్నాయి.
ఏప్రిల్‌లో కిలో చికెన్ ధర రూ.150 ఉండగా ప్రస్తుతం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం లైవ్ కోడి ధర రూ.195, చర్మంతో రూ.290, చర్మం లేకుండా రూ.320కి చేరింది. కోళ్ల రవాణా ఛార్జీలు, కోళ్ల దాణా ఖర్చులు పెరగడం కూడా ధరలు పెరుగుదలకు కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఆదివారమొస్తే చాలు గ్రేటర్‌లో 8 లక్షల నుంచి 12 లక్షల కిలోలు, సాధారణ రోజుల్లో 5 లక్షల నుంచి 7 లక్షల కిలోల చికెన్ అమ్ముడయ్యేది. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.