హైదరాబాద్ మహానగరంలో మరో దిశకు మెట్రో విస్తరించనుంది. ఇప్పటికే నగరం నాలుగు వైపులా విస్తరిస్తున్న మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం మరింత విస్తరించనుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున హరితోత్సవం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. మెట్రో రైల్ సౌకర్యాన్ని మహేశ్వరం వరకూ పొడిగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ‘‘మెట్రో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా చూడాల్సింది. కానీ అప్పటి పాలకులు ఆలోచించలేదు. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం వరకూ రూ.6 వేల కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టాం. ఎయిర్‌పోర్టు నుంచి మహేశ్వరం, కందుకూరు వరకూ పొడిగించేందుకు కృషి చేస్తాం. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో రైల్‌ను బీహెచ్‌ఈఎల్ వరకూ పొడిగించనున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.