ఆ మూడు తప్పులు గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ అవ్వొద్దన్న కేసీఆర్

-

దుబ్బాకలో సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన తర్వాత కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహం మార్చింది. మహా వేగంతో సాగుతున్న ఈ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది అధికార పార్టీ. అభ్యర్థుల ఎంపిక నుంచి.. వారి గెలుపు వరకు డివిజన్ల స్థాయిలోనే ఎన్నికల రణతంత్రం రచించింది. ఈ సందర్భంగా దుబ్బాకలో చేసిన మూడు తప్పులను రిపీట్‌ చేయకూడదన్న ఆలోచనతో టీఆర్‌ఎస్‌ ముందుకెళ్తోందన్న సమాచారం పార్టీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోందట.


దుబ్బాకలో అభ్యర్థి ఎంపిక వీక్‌గా ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో తేలిందట. అలాగే గులాబీ దళపతి స్వయంగా పూనుకోకపోవడం.. సభలు నిర్వహించకపోవడం.. ప్రచారం చేయకపోవడం పార్టీకి నష్టం చేకూర్చాయని గుర్తించారట. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీ నేతలు చురుకుగా వ్యవహరించకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణంగా విశ్లేషించినట్టు సమాచారం. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో ఈ మూడు తప్పులను రిపీట్‌ చేయకూడదని నిర్ణయించారట కేసీఆర్‌.

గ్రేటర్ లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం మొత్తం సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో నడుస్తోందని టాక్‌. స్వయంగా ఆయనే పూనుకుని నేతలను గైడ్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. దుబ్బాకలో చేసినట్టు కాకుండా కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు గులాబీ నేతలు. సిట్టింగ్‌ కార్పొరేటర్ల పనితీరు.. ఎవరిపై వ్యతిరేకత ఉంది.. మళ్లీ టికెట్‌ ఇస్తే గెలుస్తారా లేదా అన్న అంశాలపై అనేక సర్వేలు వడపోతలు జరిగాయట. మూడు విడతలుగా ప్రకటించిన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇక గెలుపు బాధ్యతలను కార్పొరేటర్లు, అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలపైనే వదిలేకుండా మంత్రులను, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులను రంగంలోకి దించారు సీఎం కేసీఆర్‌. ఒక్కొక్కరికీ ఒక్కో డివిజన్‌ అప్పగించారు. ఆయా డివిజన్లలోని ప్రతిఒక్క ఒటరును కలిసేలా ప్రచార ప్రణాళిక రచించారు గులాబీ దళపతి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభ కూడా ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలతోపాటు ప్రచారం చివరి సమయంలో కేసీఆర్ సభ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. మరి.. మారిన ప్లానింగ్‌ గ్రేటర్‌ వార్‌లో ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news