తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. అధికార బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ సభ జరగనుంది. ఏర్పాట్లను బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యవేక్షించారు.
నకిరేకల్‌లో పదెకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను నియోజకవర్గ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్య పర్యవేక్షిస్తున్నారు. నకిరేకల్‌లో బహిరంగ సభ అనంతరం….. నల్గొండలోని మర్రిగూడ బైపాస్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. అధినేత రాక దృష్ట్యా భారీగా జనసమీకరణలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమ్యాయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.