రాష్ట్రంలో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో అధికారులు కఠినంగా ఉండాలని.. పరిస్థితులు చేయదాటిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు అధికారులతో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
నగరంలో పరిస్థితులను అధికారులు సమావేశంలో వివరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని చెప్పినట్లు తెలిసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.