ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. కేసీఆర్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా సిద్దిపేటలో పర్యటించనున్నారు. భూగర్భజలాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ సీఎం తన బృందంతో రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్కుక్‌లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ను మొదట సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతా గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ప్రవహించే కూడవెల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శిస్తారు. పాండవుల చెరువు వద్ద రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
బుధవారం రోజున సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న దేవాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఆలయ అభివృద్ధికి రూ.600 కోట్లు ప్రకటించారు. యాదాద్రి తరహాలో కొండగట్టు కోవెలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.