దేశంలోనే అత్యంత పెద్ద ఆస్పత్రిగా హైదరాబాద్ నిమ్స్ రూపుదిద్దుకోనుంది. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,571 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నూతన భవనంలో అదనంగా రెండు వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. భవన సముదాయానికి బుధవారం ఉదయం 10 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు.
మొత్తం 32 ఎకరాల 16 గుంటల స్థలంలో రూపుదిద్దుకోనున్న నూతన భవన సముదాయంలో మొత్తం 4 బ్లాక్‌లను అందుబాటులోకి తేనున్నారు. అందులో ఓపీ సేవల కోసం ఒక బ్లాక్, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులో ఉంచనున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ బ్లాక్‌లలో లోవర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు ఒక్కో బ్లాక్‌లో మరో 8 ప్లోర్లు నిర్మించనున్నారు.
ఇక ఐపీ బ్లాక్‌లలో గ్రౌండ్ ఫ్లోర్ కలిపి ఒక్కో దానిలో 15 ఫ్లోర్లు రూపుదిద్దుకోనున్నాయి. 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ పడకలు నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 38 విభాగాలకు సంబంధించిన సేవలను ఇక్కడ అందించనుండగా.. అందుకోసం 32 మాడ్యూలార్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యూలార్ థియేటర్లు సిద్ధం చేయనున్నారు.