మునుగోడు ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఎన్నికలోనైనా ఆశావహులు చాలామంది ఉంటారు. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. మునుగోడు ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, ఎవరికివారే ఊహించుకొని ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు.
అన్ని విధాలుగా కసరత్తు చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని, సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా అభ్యర్థిని గెలిపించేందుకు స్థానిక నేతలు కష్టపడి పనిచేయాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నించవద్దని సూచించారు. శనివారం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపిక అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.