హైదరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఇక లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పీఏసీ సమావేశంలో ఇదే అంశంపై కీలకంగా చర్చ జరిగింది. పీఏసీ భేటీలో మూడు అంశాలపై తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రచారం చేసిన ఇతర పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ఆమోదించారు. పీఏసీ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశంపై కూడా చర్చ జరిగింది.
ప్రధానంగా లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జులుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎంలకు రెండేసి చొప్పున లోక్ సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల, మహబూబ్ నగర్ ఇన్ చార్జీ సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇన్ చార్జీగా భట్టి విక్రమార్క, ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జహీరాబాద్ కి పి.సుదర్శన్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిజామాబాద్ కి జీవన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహా, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ కి కొండా సురేఖలను ఇన్ చార్జీలుగా అధిస్టానం నియమించింది.