వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర గంటల దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నకి 36 వేల 210, భారాస బలపరిచిన రాకేశ్‌రెడ్డికి 28 వేల 540, బీజేపీ బలపరచిన ప్రేమేందర్‌రెడ్డికి 11 వేల 395 ఓట్లు వచ్చాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ ముగిసేసరికి.. తీన్మార్ మల్లన్న 7 వేల 670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం తొలి రౌండ్‌లో 96 వేల 097 ఓట్లు ఉండగా.. అందులో చెల్లిన ఓట్లు 88 వేల 369 కాగా…. చెల్లని ఓట్లు 7 వేల 728 ఓట్లు. రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది. పట్టభధ్రుల ఉపఎన్నికలో మొత్తం 3 లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. ఇవాళ పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.