కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సభ తర్వాత నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తన స్పీచ్ లో ప్రధానమంత్రి మోడీపై వ్యాఖ్యలు చేశారు.
నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ.. అనే ఇంటి పేరు ఎందుకు ఉంది? దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుందో? అని వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే, గుజరాత్ మాజీమంత్రి పూర్నేష్ క్రిమినల్ కేసు, పరువు నష్టం దావా వేశారు. 2021 అక్టోబర్ లో రాహుల్ గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. పలు దఫాలుగా విచారణ తరువాత 2023 మార్చి 23న గురువారం కోర్టు తీర్పునిచ్చింది.
అయితే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ పై ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ కుట్రలో భాగంగానే రాహుల్ కి జైలు శిక్ష పడిందని విమర్శించారు. మోడీ ఉడత ఊపులకు కాంగ్రెస్ భయపడదని అన్నారు భట్టి విక్రమార్క. బిజెపి పిట్ట బెదిరింపులను లెక్క చేయమని.. రాహుల్ గాంధీని జైల్లో పెడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.