ఆదాయ పన్ను శాఖాధికారుల విచారణకు కాంగ్రెస్ నేతలు చిగురింత పారిజాత నరసింహరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలు గైర్హాజరయ్యారు. తమ తరపున చార్టెడ్ అకౌంటెంట్లను పంపారు. ఈ నెల 2వ తేదీన ఉదయం కాంగ్రెస్ నేతలు, చిగురింత పారిజాత నరసింహరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి బంధువు గిరిధర్ రెడ్డి నివాసాల్లో ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ ఉదయం వరకు కూడ ఈ సోదాలు సాగాయి.ఈ నెల 3వ తేదీన జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి నివాసంలో కూడ ఐటీ అధికారులు సోదాలు చేశారు.
రెండు రోజుల పాటు పారిజాత నరసింహరెడ్డి, కెఎల్ఆర్ నివాసాల్లో ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాల సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను, నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్నందున విచారణకు రాలేనని కెఎల్ఆర్ ఐటీ శాఖాధికారులకు సమాచారం పంపారు. తన తరపున తన చార్టెడ్ అకౌంటెంట్ ను పంపారు.
మరో వైపు బడంగ్ పేట మున్సిపల్ చైర్ పర్సన్ పారిజాత నరసింహరెడ్డి దంపతులు కూడ ఐటీ విచారణకు హాజరు కాలేదు. తమ తరపున చార్టెడ్ అకౌంటెంట్ ను పంపారు. ఇదిలా ఉంటే పారిజాత నరసింహరెడ్డి దంపతులకు ఐటీ అధికారులు ఇవాళ ఫోన్ చేశారు. ఏ రోజున విచారణఖకు రావాలో సమాచారం ఇస్తామని చెప్పారని సమాచారం. నాలుగు రోజుల తర్వాత పారిజాత నరసింహరెడ్డి దంపతులను విచారణకు ఐటీ శాఖాధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.