మునుగోడు ఉప ఎన్నికలపై ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నియోజకవర్గ కమిటీ కన్వీనర్ మధుయాష్కీలతోపాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్ల సమావేశం మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశాలల్లో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల అంశంపైనే చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిట్టింగ్ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్ ప్రారంభించింది. నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఆశావహులతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు.