- ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి అవకాశాలు
- తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ః కార్పొరేటు సంస్థలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి అన్నారు. తాజాగా ఆమె ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఖమ్మంలోని పలు పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. సబిత ఇంద్రరెడ్డితో పాటు మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. మొదటగా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలేంలో రూ.2.20 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ బడుల్లో అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దీనిలో భాగంగా అన్ని పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేశాయి కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. కార్యరూపం దాల్చిందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం.. ఖమ్మం నియోజకవర్గంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శంచారు. అలాగే, ఇందిరానగర్‌లోని ప్రాథమిక పాఠశాల, బోనకల్‌లోని కేజీబీవీ, చింతకానిపల్లి కేజీబీవీ, ముడిగొండ కేజీబీవీలలో నూతనంగా నిర్మించిన భవనాలను సైతం ప్రారంభించారు.
అలాగే, ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లను మంత్రులు సబితా, పువ్వాడ అజయ్ కుమార్ లు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఐటీ రంగాన్ని ఖమ్మం జిల్లాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పువ్వాడకు ఆమె అభినందనలు తెలిపారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్‌ను సందర్శించారు.