బలగం.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే. చిన్న సినిమా రిలీజై.. వసూళ్లలో ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ నేటివిటీతో తీసిన ఈ చిత్రం అంతర్జాతీయ వేడుకలపై సత్తా చాటింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా ఈ మూవీలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలుగు రాష్ట్రాలు పట్టం కట్టాయి. తాజాగా ఈ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేండ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
ఆరోగ్యం పూర్తిగా క్షీణించి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సర్కారు స్పందించి దళితబంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం మొగిలయ్య దంపతులను శాలువాతో సత్కరించిన వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య దళిత బంధు మంజూరు పత్రా న్ని అందజేశారు.