ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ మధ్య అధికారులు నిద్రపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలా ఓ కార్యక్రమంలో నిద్రపోయిన అధికారిపై ఇటీవల వేటు పడింది కూడా. అయితే ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమానికి హాజరైన ఓ కేంద్ర మంత్రి నిద్రపోయారు. పట్టపగలు.. కెమెరా నిఘాలో ఉన్న కార్యక్రమంలో ఓ ప్రజాప్రతినిధి.. అదికూడా ఉన్నతస్థాయిలో ఉన్న కేంద్ర మంత్రి కునుకుతీయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..
ఏపీలోని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం కార్యాలయ సమీపంలోని ఆడిటోరియంలో మంగళవారం రోజ్‌గార్ మేళా జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి వేదికపై కునికిపాట్లు తీస్తూ కనిపించారు. ప్రధానమంత్రి వచ్చి.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగిస్తున్నంతసేపూ కౌశల్ కిశోర్ నిద్రిస్తూనే ఉన్నారు. అధికారులు మధ్యమధ్యలో మంత్రిని మేల్కొల్పుతూ కనిపించారు.