ఎన్నికల ముందు ప్రకటించినట్టుగానే రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్ అశోక్ నగర్ లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాల భర్తీకి ప్రతీ సంవత్సరం వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూపు-1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని.. గ్రూపు-2 పరీక్షలు కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రశ్నా పత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల వారు ఆర్థిక ఇబ్బందులతో యూపీఎస్సీ పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ కి ఎంపికైన వారికి ఇంధన శాఖ పక్షాన ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా అందించినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.