పబ్బుకు ఎందుకు వెళ్లావు.. అని ఎవ్వరినీ అక్కడ అడగవద్దు. యాక్టర్ కల్లపు కుషితా (ఇరవై ఏళ్లు) ను అస్సలు అడగవద్దు. ఎందుకంటే ఆ చిన్నది కేవలం బజ్జీలు తినడానికే అక్కడికి వెళ్లింది. అదేవిధంగా వీకెండ్ పార్టీలలో మంచి సంగీతం వినిపిస్తారు కనుక ఆ ర్యాక్ బ్యాండ్ సౌండ్స్ నో లేదా డీజే సౌండ్స్ నో ఎంజాయ్ చేసేందుకు మాత్రమే వెళ్లింది. అయ్యో ! ఇది తప్పు కదా! అంటే నేను జస్ట్ ఎప్పుడో వెళ్తాను. పార్టీలకు అస్సలు వెళ్లను అని పరోటా కబుర్లు ఓ వంద చెబుతోంది. అదే సమయంలో మూడు రోజుల కిందటే ఇక్కడికి వచ్చానని, మళ్లీ రావాలి అని అనిపించి మరోసారి వచ్చానని చెబుతోంది. అస్సలు పశ్చాత్తాపం లేని విధంగా ఆ అమ్మాయి మాట్లాడుతోంది.
నిండా ఇరవై ఏళ్లు కూడా నిండ లేదు కదా ఎందుకని పబ్ కు వెళ్లావు అని మీడియా అడిగితే తప్పేం ఉంది నేను గతంలో కూడా వెళ్లాను అక్కడ డ్రగ్ కల్చర్ ఉంటుందని నేనెలా అనుకోగలను.. మిమ్మల్ని తీసుకువెళ్లిన హర్ష అనే యువకుడు కూడా గతంలో డ్రగ్ కేసులో పట్టుబడి 90 రోజుల పాటు జైలు జీవితం అనుభవించి వచ్చాడు కదా! కనీసం అతని గురించి అయినా మీకు తెలుసా అంటే అవేవీ తెలియదు…ఒకవేళ ఆ విధంగా ఆయన శిక్ష అనుభవించినా జీవితాంతం అలానే ఉంటారని ఎలా అనుకోగలను అని ఎదురు ప్రశ్నిస్తోంది.ఇదీ ఇవాళ్టి పబ్బుల గోల. వెళ్లే వారు వెళ్తారు.. వచ్చే వారు వస్తారు. ఓటీపీ లేనిదే ఇంకా చెప్పాలంటే ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేనిదే అస్సలు వెళ్లేందుకు వీల్లేని చోట తమకు ఏ పాపం తెలియదని పదే పదే చెబుతుండడమే ఈ కథలో ట్విస్టు.
పూర్వపరాలివి..
హైద్రాబాద్, బంజారాహిల్స్ లో జరిగిన డ్రగ్ డ్రైవ్ లో పలువురు సినీ ప్రముఖులు పట్టుబడిన సంగతి విధితమే! ఈ కేసులో పలువురు రాజకీయ ప్రముఖుల పిల్లలూ ఉన్నారు. కేసుకు కీలకం అని భావిస్తున్న నలుగురిలో ఇద్దరు అరెస్టయ్యారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. దొరికిన వారంతా తాము ఏ పాపం చేయలేదనే అంటున్నారు. ఆ విధంగా తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చుకుంఉటన్నారు. కొందరు జస్ట్ లేట్ నైట్ పార్టీ ఎలా అవుతుందో తెలుసుకునేందుకే రాడిసన్ హోటల్ కు చేరుకున్నామని అత్యంత అమాయకంగా చెబుతున్నారు. ఈ విషయంలో మీడియా అతి చేస్తుందని, హద్దు దాటితే తాము న్యాయ పోరాటం చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నామని,ఆ విధంగా రిపోర్టర్లపై కేసులు ఫైల్ చేసేందుకు, పరువు నష్టం దావా వేసేందుకు కూడా తాము సిద్ధమేనని అంటున్నారు.