నేడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 4 లక్షల 91 వేల 862 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలను రాశారు. ఇందులో 4 లక్షల 22 వేల 795 మంది విద్యార్థులు పాసయ్యారు. ఈ ఏడాది పదవ తరగతి పాస్ పర్సంటేజ్ 86.60% గా నమోదయింది. పదవ తరగతి ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇక పరీక్షలలో పాస్ కాలేదని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బలవన్మరణాల విషయం తనను కలచి వేస్తుందని.. విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లమెంటరీ పరీక్షలు వెంటనే నిర్వహిస్తున్నామని తెలిపారు. కాబట్టి వెనకబడతామనే ఆందోళన వద్దని సూచించారు. అటు తల్లిదండ్రులు పిల్లలకు మనోధైర్యం ఇచ్చి అండగా నిలవాలన్నారు మంత్రి. ఇక ఫెయిల్ అయిన వారికి జూన్ 14 నుంచి జూన్ 22 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మే 26వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.