హైదరాబాద్ శివారులలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగర శివారులలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాని పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ ని తయారు చేస్తున్న ముఠాని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. తయారుదారులతోపాటు సప్లయర్ ని అరెస్టు చేసినట్టు తెలిపారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు సిపి.

ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, మూడున్నర కిలోల సబ్ స్టాన్ సెస్ లిక్విడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే రాచకొండలో బ్యాంకులను బరిడి కొట్టించిన ముఠాని పట్టుకున్నారు మల్కాజ్గిరి ఎస్ఓటి, నాచారం పోలీసులు. నకిలి కంపెనీ సృష్టించి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ పేరుతో 2.50 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్ నుండి అమాయకులను తీసుకువచ్చి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్స్, ఫోటోలు పెట్టి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుండి 93 డెబిట్ కార్డులు, మూడు క్రెడిట్ కార్డులు, 54 ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.