మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్‌పై ఈడీకి కీలక ఆధారాలు లభ్యం

-

గత రెండ్రోజులుగా తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై ఈడీ దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ జిల్లా దక్కన్‌, రంగారెడ్డి జిల్లా పట్నం మహేందర్‌రెడ్డి, భాస్కర్‌, మేడ్చల్‌ జిల్లా మల్లారెడ్డి, మెడిసిటీ, కరీంనగర్‌ జిల్లా ప్రతిమ, చలిమెడ, నల్గొండ జిల్లా కామినేని, సంగారెడ్డి జిల్లా ఎంఎన్‌ఆర్‌, మహేశ్వర, ఖమ్మం జిల్లా మమత, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌వీఎస్‌ వైద్య కళాశాలల్లో రాత్రి వరకు కొనసాగిన సోదాల్లో పలు పత్రాల్ని, డిజిటల్‌ పరికరాల్ని ఈడీ స్వాధీనం చేసుకొంది.

మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రూ.1.4 కోట్లతో పాటు కళాశాల బ్యాంకు ఖాతాలోని రూ.2.89 కోట్లను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ సొమ్ముకు తగిన ఆధారాలను సమర్పించడంలో కళాశాల నిర్వాహకులు విఫలం కావడంతో జప్తు చేసింది. ఇదే కాకుండా వైద్యవిద్య పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందాలో ఈడీకి కీలక సమాచారం లభించింది.

ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల బ్లాకింగ్‌పై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫిర్యాదుపై మట్టెవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసింది. కొందరు విద్యార్థులతో ప్రైవేటు వైద్య కళాశాలలు కుమ్మక్కై పీజీ సీట్లను బ్లాక్‌ చేస్తున్నాయని తమ అంతర్గత విచారణలో తేలిందని వర్సిటీ ఇచ్చిన సమాచారంపై ప్రధానంగా దృష్టి సారించింది.

Read more RELATED
Recommended to you

Latest news