తెలంగాణలో రోజు రోజుకు కరెంట్ వినియోగం భారీగా పెరిగిపోతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయంతో పాటు గృహ వినియోగానికి విద్యుత్ ను భారీగానే వాడుతున్నారని వెల్లడిస్తున్నారు. ఉక్కపోత కారణంగా ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారని.. దానివల్ల విద్యుత్ వినియోగం పెరిగిపోతోందని అంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో బోరు బావులపై ఆధారపడే ఎక్కువగా వ్యవసాయం సాగుతోందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27న్నర లక్షల బోరు బావులు ఉన్నాయని.. వర్షాలు కురవని కారణంగా రైతులు బోరు బావులపైనే ఎక్కువగా ఆధారపడినట్లు చెబుతున్నారు. భారత ఇంధన ఎక్సేంజీలో ఒక్కో యూనిట్‌కు 10 రూపాయల వరకు చెల్లించి డిస్కంలు కరెంట్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 55.21 కోట్ల యూనిట్లను రూ.218 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు డిస్కంల తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విద్యుత్ డిమాండ్ పరిశీలిస్తే…. రోజురోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతూనే ఉంది.