ప్రాణంతీసిన స్నాక్స్​ ఛాలెంజ్.. 50 మోమోస్​ తిని యువకుడు మృతి

-

బిహార్‌లో ఫ్రెండ్స్​తో చేసిన ఛాలెంజ్ ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. సరదాగా కాసిన పందెం 25 ఏళ్ల యువకుడి నిండుప్రాణాలను తీసింది. గోపాల్‌గంజ్‌, సివాన్‌ జిల్లాల సరిహద్దులోని రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో పడున్న ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. మృతుడు విపిన్‌ కుమార్‌(25)ను తూర్పు చంపారన్‌ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అనంతరం అతడి మృతిపై ఆరా తీశారు.

‘‘సివాన్‌ జిల్లాలోని గ్యానీమోర్‌ సమీపంలో విపిన్‌ ఓ మొబైల్‌ రిపేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. విపిన్‌ తన స్నేహితులతో కలిసి మోమోలు తినే పందెం కాశాడు. ఈ క్రమంలో ఏకంగా 150 వరకు మోమోలు తిని తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు’’ అని పోలీసు అధికారి శశిరంజన్‌ తెలిపారు. విపిన్‌ను అతడి స్నేహితులు కావాలనే విషం పెట్టి చంపారని తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news