ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఇంట్లోనే కాకుండా ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన నేడు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు గాను ఆయన పర్వతగిరి లో ఉన్న తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంట్లో ఉన్న మొక్కలకు పాదు తీయడం, నీరు పోయడం, నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. వీటితోపాటు చెత్తా చెదారం ఉన్న ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రస్తుతం అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు దానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పచ్చదనం – పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములై వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.