తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్ రోడ్లపై భారీగా వరద నీరు పేరుకుని పోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు పదికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 5 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ క్రమంలోనే నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. సామాన్యులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరం అయితే మినహా ఎవరూ బయటకు రాకుండా ఉండాలని సూచనలు చేశారు.