తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నేతలు హోరెత్తిస్తున్నారు. కాస్త లేటుగా ప్రచారం షురూ చేసినా.. ప్రస్తుతం జోష్ కొనసాగిస్తున్నారు. అభ్యర్థులతో పాటు ప్రధాన నేతలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. తాజాగా హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
తాజాగా ఆయన సిద్దిపేట జిల్లా వర్గల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి గెలిస్తే దేవాదాయ భూములు కూడా అమ్మేస్తారని విమర్శించారు. పేదల భూములు లాక్కోవడం తప్పా కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను ఓడించాలనే కసితో ప్రజలు ఉన్నారని తెలిపారు. గజ్వేల్‌లో ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. మద్యం, డబ్బును నమ్ముకుని బీఆర్ఎస్ పోటీ చేస్తుంటే.. ప్రజలను నమ్ముకు బీజేపీ బరిలోకి దిగిందని ఈటల రాజేందర్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.