తెలంగాణలో కేసీఆర్ సర్కార్ స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తుంటే.. ఇక్కడ లాక్కుంటున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కొని దళితులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ భూములు అవసరమైనా అసైన్డ్ భూములనే గుంజుకుంటున్నారని.. 40-50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకూ హక్కులు ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు.
“130 బీసీ కులాలంటే కొన్ని కులాలకే బీసీ బంధు ఇచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 వేల బీసీ కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకే బీసీబంధు ఇస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీ బంధు దక్కింది. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు.. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే నేను గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తాను? బీఆర్ఎస్ను గద్దె దించాలంటే బీజేపీకే సాధ్యం. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. ప్రతిపక్ష పాత్ర పోషించమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరారు.” అని ఈటల అన్నారు.