తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి పలువురు కీలక అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్‌పై గజ్వేల్‌లో బీజేపీ తరఫున పోటీకి దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్నారు.
ఈ నేపథ్యంలో శామీర్ పేటలో ఆయన నివాసంలో భార్య ఈటల జమున ఆయనకు వీర తిలకం దిద్ది గజ్వేల్‌కు పంపించారు. గజ్వేల్ చేరుకున్న ఆయన పట్టణంలోని పాండవుల చెరువుపై ఉన్న కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ఆయన తన మద్దతుదారులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ ర్యాలీలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఈటల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈటల గజ్వేలే కాకుండా తన కంచుకోట అయిన హుజూబాద్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.