ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ రైల్లో రెండు బోగీలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేశారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ.. అగ్నిప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని వెల్లడించారు.
ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ ఆ విషాదం నుంచి భారత్ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఆ ఘటన తర్వాత ఒడిశా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, యూపీ, తమిళనాడు, ఏపీలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణ నష్టం జరగలేదు కానీ.. రైలు ప్రయాణం అంటే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది.