ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏం జరగలేదు. అయితే ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఓ యువకుడు రైలు చైను లాగి పలువురు ప్రయాణికులను కాపాడాడు. మిగిలిన వారిని అప్రమత్తం చేశాడు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించాడు.
‘ఒడిశాలోని పర్లాకిమిడికి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కాం. ఉదయం 11 గంటల సమయంలో నేను పై బెర్తులో పడుకొని ఉండగా రబ్బరు కాలినట్లు వాసన వచ్చింది. పై నుంచి వేడి వస్తుంటేయ. ఎండకు ఉండొచ్చని అనుకున్నా.. కానీ మరీ ఎక్కువ కావడంతో కిందికి దిగి కిటికీలోంచి చూడగా పొగ వస్తోంది. వెంటనే కేకలు వేశాను. చైన్ గట్టిగా లాగితే రైలు ఆగింది. అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం ఇచ్చాను. మా కుటుంబ సభ్యులను కిందికి దించాను. తోటి ప్రయాణికులు కిందకు దిగడానికి సహకరించాను. పొగను ఎక్కువగా పీల్చడంతో నేను స్పృహతప్పి పడిపోయాను. ఐదారు నిమిషాలు ఆలస్యమైనా తీవ్ర నష్టం జరిగేది.’ అని రాజు చెప్పుకొచ్చాడు.