ఆ మంత్రుల్లో ‘ గ్రేటర్ ‘ టెన్షన్ ? తేడా వస్తే ?

-

అంతా సక్రమంగా ఉన్నంతసేపు కేసీఆర్ నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అదే తేడా వస్తే మాత్రం ఎంతటి వారినైనా ఉపేక్షించరు. ఈ విషయంలో వారు, వీరు అనే తేడా చూపించరు. ఇది మొదటి నుంచి కెసిఆర్ కు ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఫలితాలు గతంలో మాదిరిగా ఆశాజనకంగా ఉండే ఛాన్స్ లేవనే  సర్వే రిపోర్టులు అందడంతో కేసీఆర్ లో మరింత టెన్షన్ పెరిగిపోతుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల బరువు బాధ్యతలన్నీ, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చూస్తున్నారు. 2016 ఎన్నికల్లో 99 కార్పొరేటర్ లను గెలుచుకున్న క్రెడిట్ ఆయనకు ఉండడంతో, ఈ సారి ఆయనే ఈ ఎన్నికల బాధ్యతనూ తీసుకున్నారు.

వందకు పైగా స్థానాలను దక్కించుకోవాలనే అభిప్రాయంతో గట్టిగానే కష్టపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, కేటీఆర్ తో పాటు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నలుగురు మంత్రులకు వీటి బరువు బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కి సైతం ఈ బాధ్యతలను అప్పగించడంతో, ఇది వారికి పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఇప్పటికే కెసిఆర్ 18 నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమించి వారి ద్వారా క్షేత్రస్థాయిలో, పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. 2016 లో ఏ విధంగా అయితే మంత్రులకు జిహెచ్ఎంసి బరువు బాధ్యతలను అప్పగించారో, అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసి బాధ్యతలను అప్పగించడంతో మంత్రుల్లో వణుకు మొదలైంది.

గతంలో మాదిరిగా ఇప్పుడు సానుకూల పరిస్థితులు లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, బిజెపి బలోపేతం కావడం, సర్వేల్లోనూ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తుండడం, వీటన్నిటిని బేరీజు వేసుకుంటున్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లలో సగం మందికి పైగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారే కావడంతో, వారికి టికెట్లు ఇద్దామంటే, మళ్లీ కొత్త తలనొప్పులు మొదలవుతాయని, అలా అని పాత వారికి టికెట్లు కేటాయిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనేది సైతం మంత్రుల్లో టెన్షన్ పెరగడానికి కారణం అవుతోందంట.

ఒకవేళ ఈ  ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా రాకపోతే, మంత్రి పదవుల నుంచి సైతం తప్పించడమో, లేక ప్రాధాన్యం లేని శాఖలను అప్పగిస్తారనే భయం ఇప్పడు  గ్రేటర్ పరిధిలోని ఉన్న నలుగురు మంత్రులను టెన్షన్ పెడుతోంది. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, గట్టిగానే కష్టపడుతూ, తమ అనుచరులను రంగంలోకి దించి తమ శక్తికి మించి కష్టపడుతున్నారట.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news