బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కలవరం అని అన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు.

‘‘బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ చేతులెత్తేశారు. బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటల రాజేందర్‌కు అర్థమైంది. భారాస అంటే భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు కలవరం. కాంగ్రెస్‌ వాళ్లు పదవుల కోసం పాకులాడే వాళ్లు. దిల్లీలో ఉండే రాహుల్‌, మోదీకి పాలమూరు మీద ప్రేమ ఉంటుందా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్​రావు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు జిల్లాను వలసల జిల్లాగా, కరవు జిల్లాగా చేశాయనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చదనం, నీళ్లతో కళకళలాడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు పరుస్తున్నామని వివరించారు.