ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అకాల వర్షాలతో, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 4,300 ఎకరాలలో పంట నష్టానికి నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలను 393 మంది రైతులకు నష్టపరిహారం డబ్బు నేరుగా ఆయా బ్యాంకుల వెబ్ సైట్ నుండి రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలంటున్నారని.. వారికి మీరే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అంటే యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టిన ప్రభుత్వమని ఆరోపించారు. కెసిఆర్ రుణమాఫీ చేయడేమో అని ధర్నా చేద్దాం అనుకున్న కాంగ్రెస్ వాళ్లకు రైతులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.