పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి..? కారణాలు ఏంటి..?

-

ఈరోజుల్లో చాలా మందికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంటుంది. కొందిరికి ఇది గర్భంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. మరికొందరికి డెలివరీ అయిన తర్వాత కొన్ని నెలలకు, కొన్ని ఏళ్లకు బయటపడుతుంది. గర్భంలో ఉన్నప్పుడే తెలిస్తే.. చాలామంది అబార్షన్ చేయించుకుంటారు. నవజాత శిశువులు మరణించడానికి ముఖ్య కారణాల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు కూడా ఒకటి అని చెబుతున్నారు వైద్యులు. గర్భం ధరించాక తల్లి కడుపులో మొదట గుండె ఏర్పడుతుంది. గుండె ఏర్పడినప్పుడే కొంతమంది శిశువుల్లో సమస్య వస్తుంది. గుండె కండరాల గోడలు పూర్తిగా ఏర్పడకపోవడం వల్ల అవి రంధ్రాలుగా మారతాయి. అయితే ఇలా ఎందుకు కండరాల గోడలు పూర్తిగా ఏర్పడవో మాత్రం వైద్యులు వివరించలేకపోతున్నారు. దీనికి జన్యు లోపాలు కూడా కారణం కావచ్చు.

మేనరిక వివాహాల్లో ఎక్కువగా..

మేనరిక వివాహాలు చేసుకునే వారిలో ఎక్కువగా ఇలా గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే గర్భిణులు వాడే కొన్ని రకాల మందులు కూడా ఇలా గుండె రంధ్రాలకు కారణం అవుతాయి. ధూమపానం, మద్యపానం చేసే గర్భిణులకు పుట్టే పిల్లల్లో ఇలాంటి సమస్యలు రావచ్చు. తల్లులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనా, వారి వయసు అధికంగా ఉన్నా పుట్టే పిల్లలకు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం సోకినా కూడా కొంతమంది పిల్లల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఎలాంటి కారణమూ లేకుండా కూడా గుండెకు చిల్లులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నెలలు నిండకుండా పుట్టినా..

నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోవడం లేదా రక్తంలో పొటాషియం స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉండడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా గర్భస్థ శిశువులో గుండె సమస్యలు రావడానికి కారణాలు అని చెబుతున్నారు వైద్యులు. గుండెలో ఉండే రెండు జఠరికలు లేదా రెండు కర్ణికల మధ్యలో లోపం ఉంటే దాన్ని గుండెలో రంధ్రం పడిందని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి పిల్లలకు నిమోనియా వచ్చినా, జ్వరం, రక్తహీనత వంటి సమస్యలు వస్తే గుండె తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కొన్నిసార్లు గుండె పని చేయకుండా ఆగిపోతుంది. అప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

ఇలా తెలుసుకోవచ్చు..

అప్పుడే పుట్టిన బిడ్డల్లో గుండె సమస్య ఉందో లేదో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. వారు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నా, పుట్టిన పది నిమిషాల తర్వాత బిడ్డ గులాబీ రంగులోకి మారకుండా, నీలిరంగులోనే ఉన్నా కూడా వారికి గుండె సమస్య ఉందని అనుమానించుకోవాలి. వైద్యులు వెంటనే 2d ఎకో పరీక్ష చేసి గుండె జబ్బు ఉందో లేదో నిర్ధారణ చేస్తారు.

గుండెల్లో రంధ్రాలను పోల్చగల ఆధునిక వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ వయసు, బరువు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వైద్యులు సర్జరీ నిర్వహిస్తారు. చాలా మంది పిల్లలు సర్జరీల తర్వాత కోలుకొని సాధారణ జీవితాన్ని గడుపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news