బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని ఆరోపించారు. వైద్యరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, కానీ ప్రస్తుతం 75 వేల మందికి ఒక 108 వాహనం అందుబాటులో ఉందని తెలిపారు. అమ్మఒడి వాహనాలకు నిధులు కావాలని కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని చెప్పారు. జననం నుంచి మరణం వరకు తెలంగామలో.. వైద్య, ఆరోగ్యశాఖ సేవలు అందిస్తుందని అన్నారు. వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్ రావు వివరించారు.