రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ వద్ద సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించారు హరీశ్ రావు. రాష్ట్రం పదే పదే అప్పుల పాలైందని సీఎం చెబుతున్నారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వదిలేయడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు స్వయంగా సీఎం పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా చేయడమేనన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వైఖరినీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు హరీశ్ రావు. 6.85 లక్షల కోట్ల అప్పు ఉందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్ని సార్లు, ఇంకెన్ని రోజులు చేస్తారు రేవంత్ రెడ్డి..? ప్రజా పాలన దినోత్సవం వేదికగా కూడా తొండి వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏముంది..? అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులను మూలధనంగా మార్చి, ఎన్ని ఆస్తులు సృష్టించామో, ఎంత సంపద సంపాదించామో లెక్కలతో సహా చెప్పాను. అయితే దివాళా తీసిందని రాష్ట్రానికి శాపం పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు హరీశ్ రావు.