స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్ల పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
స్కిల్ కేసుతో సంబంధం లేదని ప్రమోద్ కుమాద్ దూబే వాదించారు. రెండేళ్ల తరువాత రాజకీయ కారణాలతో కావాలని ఈ కేసులో ఇరికించినట్టు చెప్పారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు దూబె. మరోవైపు పొన్నవోలు వాదనలు వినిపిస్తూ.. ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరుగలేదని.. ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయనను విచారించాల్సి ఉందని.. కస్టడీకి ఇవ్వాలని కోరారు.