తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులు అన్ని జలకళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో జోరుగా వానలు కురుస్తుండటంతో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లను 10 అడుగులు, 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 589 అడుగులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.