హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నగరంలో మూసీ రివర్ వరదలై పారుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండటంతో నిన్న గేట్లు తెరిచిన విషయం తెలిసిందే. తాజాగా భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, బోరబండ, ఎస్.ఆర్ నగర్, బాచుపల్లి, నల్లగండ్ల, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అత్యధికంగా ఖైరతాబాద్ లో వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చారు. భారీ వర్షం కురవడంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరూ వర్షంలో సైతం వినాయకుడిని దర్శనం చేసుకోవడం విశేషం. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తుల తాకిడి కాస్త ఎక్కువ అయింది. వర్షం కారణంగా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అధికారులు అవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని కీలక హెచ్చరిక జారీ చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారు.