కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ మహానగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ సాయంత్రం లింగంపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ప్రయాణిస్తోంది. ఓ వైపు రాహుల్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా.. మరోవైపు సాధారణ వాహనాలను దారి మళ్లించి వన్‌వేలో రెండు వైపులా వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్ దాటిన తర్వాత సాయంత్ర వేళ బాలుడితో రాహుల్ గాంధీ క్రికెట్ ఆడారు. ఆ సందర్భంలో కొంత సమయం ట్రాఫిక్ ఆగింది.
అనంతరం పటాన్‌చెరు ఆనంద్‌భవన్ హోటల్లో 20 నిమిషాల పాటు రాహుల్ సేద తీరారు. అప్పుడు కూడా కార్యకర్తల రద్దీతో రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టినప్పటికీ రహదారికి రెండు వైపులా రద్దీ కొనసాగింది. అనంతరం ముత్తంగిలో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించడంతో ముత్తంగి నుంచి పటాన్‌చెరు వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.