ఎండాకాలం వచ్చేసింది. ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. మళ్లీ జూన్ 1వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలలకు వర్తిస్తాయని, ఈ ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. వచ్చే విద్యా సంవత్సరానికి బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.