కమాండ్ కంట్రోల్‌తో హైదరాబాద్‌లో భద్రత మరింత పటిష్ఠం : హోంమంత్రి మహమూద్

-

దేశానికే తలమానికంగా నిలువనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆధునిక హంగులతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ అధికారులతో కలిసి మహమూద్‌ అలీ సందర్శించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సంబంధించిన విషయాలను డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వారికి వివరించారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ రూపుదిద్దుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో హైదరాబాద్‌లో భద్రత మరింత పటిష్ఠం కానుందని హోంమంత్రి తెలిపారు.

600కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో…. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు మంత్రి తలసాని వివరించారు.

ఐదు టవర్లు.. ఒకేసారి లక్ష సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు భారీ వీడియో వాల్‌.. 30 పెటాబైట్ల సామర్థ్యం ఉన్న సర్వర్లు.. కృత్రిమ మేధ వినియోగం.. డీజీపీ, కమిషనర్‌ ఛాంబర్లు.. ఓ టవర్‌పైన హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలివి.

రాష్ట్రంలో ఏ మూలన ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలనైనా ఇక్కడ వీక్షించవచ్చు. శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడూ కీలక శాఖలను ఇక్కడి నుంచి అప్రమత్తం చెయ్యొచ్చు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే పోలీసింగ్‌లో దేశానికే తలమానికంగా నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news