కేటీఆర్ కు తలనొప్పులు ? ఇజ్ణత్ కా సవాల్ ?

తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ పెద్దగా కంగారు పడినట్టుగా కనిపించదు. గెలుపు తప్పనిసరిగా తమ ఖాతాలో పడుతుంది అనే ధీమా,  ఆ పార్టీలో  ఎక్కువగా కనిపించేది . ఇక త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంతేస్థాయిలో ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవైపు పార్టీ అధికారంలో ఉండడం, మరోవైపు జీహెచ్ఎంసీలో గట్టిపట్టు ఉండడంతో, తమ గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తూ వచ్చింది. అయితే అకస్మాత్తుగా ముంచుకొచ్చిన భారీ వరదల కారణంగా నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఒక్కసారిగా టిఆర్ఎస్ ఆశలు అన్ని ఆవిరి అయ్యాయి. వేలకోట్ల రూపాయలు కుమ్మరించి నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాము అని గొప్పలు చెప్పుకుంటూ,  ప్రజల దగ్గర ఓట్లను సంపాదించుకునేందుకు ప్రయత్నించిన టిఆర్ఎస్ కు వరదలు గట్టి షాక్ ఇచ్చాయి.
ఫలితంగా టిఆర్ఎస్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నగరంలో సంభవించిన వరదలపై టిఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా స్పందించి, సహాయక చర్యలు చేపట్టడం,  ఆ తరువాత వరద సహాయం పంపిణీ చేయడం వంటివి చేపట్టింది. అయినా ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. బాధితులను పరామర్శించేందుకు, వరద సహాయం అందించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పై ప్రజలు తిరగబడడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకుంటూ వస్తున్నాయి. దీంతో ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల ఆదరణ ఎలా సంపాదించాలి, ప్రభుత్వ వ్యతిరేకతను ఏవిధంగా తగ్గించాలనే విషయం టిఆర్ఎస్ కు అంతు పట్టడం లేదు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను తన భుజాన వేసుకున్న కేటీఆర్ కు ఇది పెద్ద సవాల్ గా మారింది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 99 స్థానాలను తీసుకొచ్చి తన సత్తా చాటుకున్న కేసీఆర్ , ఈ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలను టీఆర్ఎస్ సాధించేలా చేస్తానంటూ గొప్పగా ప్రకటించుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే తారుమారు అయ్యేలా కనిపిస్తోంది. కేటీఆర్ కు  ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అవినీతి వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారనే  విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కొంతమంది పనితీరు పై అభ్యంతరం వ్యక్తం చేసినా, ఇప్పుడు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను మార్చి, కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవాలని, గ్రేటర్ లో విజయం సాధించి తన సత్తా చాటుకోవాలని, లేకపోతే దానికి టిఆర్ఎస్ భారీ మూల్యం  చెల్లించుకోవలసి వస్తుందనే భయం ఇప్పుడు కేటీఆర్  ను వెంటాడుతోంది. అందరికంటే ఎక్కువగా ఇప్పుడు కేటీఆర్ కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.  సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్న కేటీఆర్ కు ఒకవేళ గ్రేటర్ ఎన్నికలు షాక్ ఇస్తే, ఆయన రాజకీయ భవిష్యత్తు పైన ఆ ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.
-Surya