కారు అద్దెకు అంటూ చాలా మంది వస్తు ఉంటారు. వారిని నమ్మి కారు యజమానులు కార్లు ఇస్తూ ఉంటారు. వారి వద్ద సరైన ఐడి కార్డులు తీసుకుని ఇస్తూ ఉంటారు. నగరాల్లో ఎక్కువగా ఈ కార్లు అద్దెకు ఇచ్చే కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఇలా కార్లు ఇచ్చే వాళ్లకు ఒకడు చుక్కలు చూపిస్తున్నాడు హైదరాబాద్ లో. తాజాగా హైదరాబాద్ పోలీసులు ఒక తెలివైన దొంగను అరెస్ట్ చేసారు.
కారు యజమానులను మోసగించి, అద్దెకు తీసుకుని కార్లను తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న వినోద్ కుమార్ అనే మోసగాడిని కె.పి.హెచ్.బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, మూసాపేటలో ట్రావెల్స్ కంపెనీలు ఏర్పాటు చేసిన వినోద్ కుమార్ మోసాలకు పాల్పడుతున్నాడు. ట్రావెల్స్ లో కార్లను అద్దెకు తీసుకుని, యజమానులకు డబ్బులు ఇవ్వకుండా, బయట వ్యక్తులకు తాకట్టు పెట్టాడు.
కార్లు, డబ్బులు ఇవ్వక పోవటంతో పోలీసులను కార్ల యజమానులు ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వినోద్ కుమార్ ను అరెస్టు చేసి, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్న కె.పి.హెచ్.బి పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని బాధితులు ఎవరైనా ఉంటే మీడియా ముందుకు రావాలని పోలీసులు కోరారు. కార్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.