చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017 కంటే ముందు నుంచి ఫోన్ వ్యవహారం నడుస్తోందని కీలక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీని డిజాల్వ్ చేయాలని ఈసీకి లేఖ రాస్తా అని కీలక ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడే అని గుర్తుచేశారు. నిందితులను శిక్షించకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య ఒప్పందం ఉందని ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. నిందితులు ఎవరో తెలిసాక కూడా మౌనం మంచిది కాదని హితవు పలికారు.
ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఈ ఇష్యూపై హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆరోపించారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, వెంటనే సీబీఐకు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని, దీనంతటికీ కీలక సూత్రధారి మాజీ సీఎం కేసీఆరే అని విచారణలో తేలిందని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు తాము ఊరుకోము అని హెచ్చరించారు.