కాంగ్రెస్ mlc అభ్యర్థిని గెలిపిస్తే ఎవర్ని ప్రశ్నిస్తాడు : ఈటెల రాజేందర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అంటాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే.. ఎవర్నీ ప్రశ్నిస్తాడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలోని  దేవరకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు  ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నిసార్లు రాజకీయాలలో ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ పార్టీకి మాత్రమే సాధ్యం అన్నారు. 2018లో నేను మంత్రిగా ఉన్నకాలంలో బండి సంజయ్ బీజేపీ తరపున పోటీ చేశారు. కేవలం 3 నెలల్లో లక్ష ఓట్ల మెజారిటీతో ఊహించని విధంగా గెలిచారు. ఎన్ని సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుందో ఎవ్వరూ ఊహించలేరు.ఏ సర్వే సంస్థలు ఊహించని విధంగా బీజేపీ బలంగా తయారయ్యింది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు, వారిచ్చేదే అంతిమ తీర్పు అన్నారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చని కారణంగా ప్రజలు వారిని అసెంబ్లీ ఎన్నికలలో ఓడించారు. ఇక వారేం హామీలు నెరవేర్చగలుగుతారు. ఇప్పుడు అధికారం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ 66 రకాల హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏ రకమైన హామీలు నెరవేర్చలేకపోయింది. తెలంగాణలో అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేయబడుతున్నాయని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.

ప్రధాని మోదీ దేశం కోసం జీవిస్తా, దేశం కోసం మరణిస్తా అని ఎప్పుడో ప్రకటించారు. దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలలో ఉన్నతంగా నిలబెట్టారు. ఒక్క స్కామ్ కూడా లేదు. కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్ స్కాం, 2 జీ స్కాం అంటూ ఎన్నో స్కాంలు చేశారు. మంత్రులు, ఎంపీలే జైళ్ల పాలయ్యారు. ప్రధాని మోదీకి కుటుంబం లేదు. 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అని ప్రకటించారు. దేశ ప్రజలందరూ కూడా ఆయనను తమ తండ్రిలా ఆదరిస్తున్నారు. ప్రజల నుండి ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని నినాదాలు వస్తున్నాయి.

2020లో కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో ప్రపంచ దేశాల నాయకులు ప్రజలను కాపాడుకోలేక కన్నీళ్లు పెట్టారు. కానీ భారత ప్రధాని నరేంద్రమోదీ కన్నీళ్లు పెట్టలేదు. ధైర్యం చెప్పారు. వారికి సరైన తిండి, వసతి కల్పించారు. వైద్య సదుపాయాలు పెంచారు. యుద్ధ ప్రాతిపదికపై కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి దేశప్రజలందరికీ ఉచితంగా అందించారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరంటే నరేంద్రమోదీ పేరే మొదటి స్థానంలో ఉంది.

కరోనా వల్ల అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయి వెనుకబడి పోతుంటే మన భారత దేశం మాత్రం ఆర్థికాభివృద్ధిలో 11 వస్థానం నుండి 5 వస్థానానికి చేరుకుంది. ఒకప్పుడు బాంబుల మోతలతో బిక్కుబిక్కుమంటూ ఉండే కాశ్మీర్ ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దుతో ప్రశాంతంగా ఉంది. చక్కటి టూరిజంతో అభివృద్ధి చెందుతోంది. అమెరికా సెనెట్‌లో ప్రధానిమోదీ మాట్లాడితే వారందరూ లేచి నిలబడి పదినిముషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఇలా ప్రపంచంలో ప్రధాని మోదీ పేరు మారుమ్రోగిపోతోంది.

ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 40 ఏళ్లుగా బీజేపీ జెండాను మోస్తున్నారు. ఆయనను ఆదరించి గెలిపించాలని కోరుతున్నాను. శాసన మండలిలో ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా పంపిస్తే మన సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడి సాధిస్తాడు. ఆయనను గెలిపించాలని కోరుతున్నాను. పార్లమెంట్ ఎన్నికలలో కూడా 12 స్థానాలు గెలుస్తామని హోంమంత్రి అమిత్‌షా నమ్మకంగా చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఎలా పని చేస్తామో, అలాగే సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతీ స్థానంలో బీజేపీ పార్టీ గెలుపుకు అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news