మీడియా లేకపోతే కేవలం కరీంనగర్ కే పరిమితమయ్యే వాడిని.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరివల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను కచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కి
లేఖ రాస్తానని చెప్పారు.

రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news